టైటానిక్ విషాదానికి సాక్ష్యం.. వేలంలో రికార్డు సృష్టించిన లైఫ్ జాకెట్

  • లండన్‌లో రూ. 9 కోట్లకు అమ్ముడైన చారిత్రక వస్తువు
  • లారా మాబెల్ అనే ప్రయాణికురాలిని కాపాడిన జాకెట్
  • జాకెట్ పై ప్రమాదం నుంచి బయటపడిన 9 మంది సంతకాలు
సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌకకు సంబంధించిన వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో మరోసారి నిరూపితమైంది. ఆ మహా విషాదం నుంచి ఓ ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిన లైఫ్ జాకెట్ తాజాగా లండన్‌ లో జరిగిన వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఫీజులతో కలిపి ఏకంగా రూ.9 కోట్లకు ఓ అజ్ఞాత వ్యక్తి దీనిని సొంతం చేసుకున్నారు.

ఇంగ్లాండ్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ చారిత్రక లైఫ్ జాకెట్‌కు 6,70,000 పౌండ్ల (సుమారు రూ.7.50 కోట్లు) ధర పలికింది. ఫీజులు, ఇతర ఛార్జీలతో కలిపి దీని ధర రూ.9 కోట్లకు చేరింది. ఫోన్ ద్వారా వేలంలో పాల్గొన్న ఓ వ్యక్తి దీన్ని కొనుగోలు చేశారు.

ఈ లైఫ్ జాకెట్ టైటానిక్‌లో ఫస్ట్ క్లాస్ ప్రయాణికురాలైన లారా మాబెల్ ఫ్రాంకటెల్లికి చెందినది. ఆమె అప్పటి ఫ్యాషన్ డిజైనర్ లూసీ డఫ్ గోర్డాన్ వద్ద సెక్రటరీగా పనిచేసేవారు. 1912లో ప్రమాదం జరిగినప్పుడు, ఆమె తన యజమానులతో కలిసి ‘లైఫ్ బోట్ నంబర్ 1’లో సురక్షితంగా బయటపడ్డారు. క్యాన్వాస్ వస్త్రం, కార్క్ ముక్కలతో తయారైన ఈ జాకెట్ ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం.

దీని చారిత్రక విలువను పెంచే మరో ముఖ్య అంశం ఏమిటంటే, దీనిపై లారాతో పాటు ప్రమాదం నుంచి బయటపడిన మరో ఎనిమిది మంది సంతకాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం ఒక వస్తువుగా కాకుండా, ఆనాటి భయానక ఘటనకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. నిజానికి వేలంలో ఈ జాకెట్ 2.5 లక్షల నుంచి 3.5 లక్షల పౌండ్లు పలుకుతుందని నిర్వాహకులు అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో రెట్టింపు ధరకు అమ్ముడుపోయింది. ఇదే వేలంలో టైటానిక్ లైఫ్ బోట్‌కు చెందిన ఓ సీటు కుషన్ కూడా రూ.4.5 కోట్లకు పైగా ధర పలకడం విశేషం.

Titanic
Titanic Life Jacket
Laura Mabel Francatelli
Henry Aldridge and Son
Titanic Auction
Titanic Memorabilia
Shipwreck History
Lifeboat Number 1
Lucile Lady Duff Gordon
Titanic Disaster

More Telugu News